శ్రీసిటీలో గృహోపకరణాల యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి.. ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని సంస్థ హామీ

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆరో రోజు మంత్రి నారా లోకేశ్ ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ కుకూ ఎలక్ట్రానిక్స్ హెచ్‌ఓడీ చోహన్ చుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో గృహోపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

శ్రీసిటీలో ఇప్పటికే గృహోపకరణాల క్లస్టర్ ఉండటంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని లోకేశ్ వివరించారు. భారతదేశంలో తయారవుతున్న ఏసీలలో 40 శాతం, టీవీలలో 35 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు.

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతులు చేయడానికి అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే దక్షిణ భారతదేశంలో ఏసీలకు అధిక డిమాండ్ ఉందని వివరించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని కుకూ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు.