భూ సమీకరణ రైతులకు యాన్యుటీ పెంపు, రుణమాఫీ, అమరావతి అభివృద్ధి ప్రతిపాదనలకు ఆమోదం అవకాశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధి, రైతుల సంక్షేమం, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

భూ సమీకరణ కింద కొత్తగా రాజధానికి భూములు ఇచ్చే రైతులకు యాన్యుటీ పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. నాన్‌ జరీబు భూమికి ఎకరానికి ఏడాదికి రూ.40 వేల యాన్యుటీ, జరీబు భూమికి ఎకరానికి రూ.60 వేల యాన్యుటీ మంజూరుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

అలాగే ట్రంక్ రోడ్ల నిర్మాణం వల్ల భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు నెలకు రూ.10 వేల అద్దె భత్యం మంజూరుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్తగా భూ సమీకరణలో చేరిన గ్రామాల రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అమరావతి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం, దేవాదాయ శాఖ భూముల బదిలీ కోసం ఆ శాఖకు రూ.159 కోట్ల పరిహారం చెల్లించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వనున్నారు. ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక అక్వేరియం, కార్యాలయ నిర్మాణానికి రెండు ఎకరాల భూమి కేటాయింపునకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది.

అదే విధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాల భూమి కేటాయింపు, ఈషా ఫౌండేషన్కు భూమితో పాటు పార్కు వినియోగ హక్కులు, నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, సీఐఐకు నాలుగు ఎకరాల భూమి కేటాయింపుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.