కొండలు, అడవులు, మారుమూల ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్‌కు వీలు.. ధర రూ.1.34 లక్షలు

దేశంలో మొబైల్ నెట్‌వర్క్ అందని మారుమూల ప్రాంతాలు, కొండ కోనలు, అడవుల్లోనూ నిరంతరాయంగా కమ్యూనికేషన్ అందించేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త శాటిలైట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పన్నులతో కలిపి ఈ ఫోన్ ధరను రూ.1,34,166గా నిర్ణయించింది.

సాధారణ మొబైల్ ఫోన్లు సమీపంలోని మొబైల్ టవర్ల నుంచి వచ్చే సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తాయి. అయితే ఈ శాటిలైట్ ఫోన్ మాత్రం నేరుగా అంతరిక్షంలోని ఉపగ్రహాలతో అనుసంధానమై పనిచేస్తుంది. దీంతో మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ సేవలను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రపంచ ప్రఖ్యాత శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ఇన్మార్శాట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముఖ్యంగా విపత్తులు, అత్యవసర పరిస్థితులు, అటవీ ప్రాంతాలు, సముద్ర ప్రయాణాలు, సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే అధికారులు, భద్రతా సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలకు ఈ శాటిలైట్ ఫోన్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

మొబైల్ సిగ్నల్ అందని ప్రాంతాల్లోనూ ఎలాంటి అంతరాయం లేకుండా కమ్యూనికేషన్ కొనసాగించే సామర్థ్యం ఈ శాటిలైట్ ఫోన్ ప్రత్యేకతగా నిలుస్తోంది.