గ్యాస్ స్టవ్ ఆన్ చేయగానే చెలరేగిన మంటలు.. సముద్రంలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్న మత్స్యకారులు

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న మత్స్యకారుల బోటు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు వేర్వేరు బోటు ప్రమాదాల్లో ఆరుగురు మత్స్యకారులు గల్లంతుకాగా, మరో పది మందిని సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనల నేపథ్యంలో తాజాగా కాకినాడ జిల్లా తొండంగి మండల సముద్ర తీరంలో మరో బోటు ప్రమాదం చోటుచేసుకుంది.

ఎల్లయ్యపేట గ్రామానికి చెందిన ఎరుపల్లి కోటేష్, ఎరుపల్లి ప్రసాద్‌తో పాటు పలువురు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలో సుమారు 15 కిలోమీటర్ల దూరం వెళ్లారు. అక్కడ భోజనం వండుకునేందుకు గ్యాస్ స్టవ్ ఆన్ చేయగా, ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు చెలరేగి బోటు మొత్తం అగ్నికి ఆహుతైంది.

ఈ ప్రమాదంలో కోటేష్, ప్రసాద్ తీవ్రంగా గాయపడగా, మరో మత్స్యకారుడికి స్వల్ప గాయాలయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు అందరూ సముద్రంలోకి దూకారు. సమీపంలో ఉన్న మరో బోటులోని మత్స్యకారులు వెంటనే స్పందించి బాధితులను సురక్షితంగా రక్షించారు.

అనంతరం గాయపడిన వారిని తునిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఎల్లయ్యపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.