రెండేళ్లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు.. రైతులకు 24 గంటల్లోనే 95 శాతం చెల్లింపులు: మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి: గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వినూత్న సంస్కరణలు అమలు చేసి రాష్ట్ర చరిత్రలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెండేళ్ల ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తైన సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు.

సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులు సమర్థంగా పనిచేసి ఈ విజయానికి తోడ్పడ్డారని అభినందించారు.

గత ప్రభుత్వంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, కూటమి ప్రభుత్వం రెండో ఏడాదిలో 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని వెల్లడించారు. రూ.31 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, 11.53 లక్షల మంది రైతులకు 95 శాతం చెల్లింపులను 24 గంటల్లోనే పూర్తి చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బీపీటీ బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న 10 శాతం బ్రోకెన్ రైస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.

ప్రతి ధాన్యం బస్తాకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ద్వారా రైతు నుంచి చౌకధరల దుకాణం వరకు పూర్తి వివరాలు తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే వాట్సాప్ ద్వారా రైతులు ధాన్యం విక్రయించుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.

గన్నీ బ్యాగులు, గోదాములు, రవాణా, తేమ శాతం వంటి అంశాల్లో పారదర్శకత పెంచేందుకు పలు చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. రైతు సేవా కేంద్రాల్లోనే గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచడంతో పాటు, రవాణా ఖర్చులను కూడా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. ఆర్ఎఫ్ఐడీ స్టిక్కర్లు, స్కానర్లతో లారీల కదలికలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

తేమ కొలిచే మాయిశ్చర్ మీటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఒకే కంపెనీ, ఒకే నమూనాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం 90 శాతం ఏర్పాటు పూర్తైందని, ఖరీఫ్ నాటికి 100 శాతం పూర్తవుతుందని వెల్లడించారు.