మొబైల్ షాపు, ఇళ్లలో వరుస చోరీలు.. 178 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు స్వాధీనం

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లకు చెందిన జోసెఫ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస చోరీలకు పాల్పడ్డాడు. తెనాలిలోని లక్ష్మీ సినిమా హాల్ ఎదురుగా ఉన్న మొబైల్ షాపులో ఐఫోన్‌లు, ఇతర మొబైల్ ఫోన్లు, నగదు దొంగిలించాడు. అయితే అప్పట్లో ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు అతడిని పట్టుకోలేకపోయారు.

తర్వాత సాల్మన్ రాజు ఇంట్లో చోరీ చేసిన 51 గ్రాముల బంగారు ఆభరణాలను తన స్నేహితుడు బేతపూడి సురేశ్‌కు ఇచ్చాడు. సురేశ్ తన స్నేహితులు పవన్ తేజ, వంశీలతో కలిసి వాటిని పొన్నూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. వచ్చిన డబ్బుతో గోవా వెళ్లి ఖర్చు చేశారు.

మిగిలిన ఆభరణాలను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు జోసెఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 178 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.